అయిజ, వెలుగు: అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలన్న రైతుల అభ్యర్థన మేరకు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వేర్వేరుగా ఈ విషయాన్ని ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తెలుగు రాష్ట్రాల అధికారులు కర్నాటక ఇరిగేషన్ ఆఫీసర్లతో మాట్లాడారు. ఏపీ వాటా కింద 2.5 టీఎంసీల నీటి విడుదలకు ఏపీ ఇరిగేషన్ అధికారులు నాలుగు రోజుల కింద ఇండెంట్ పెట్టారు.
దీంతో అక్కడి ఇరిగేషన్, తుంగభద్ర డ్యామ్ బోర్డు ఆఫీసర్లు హోస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ నుంచి మూడు రోజుల కింద ఏపీ వాటా నీటిని విడుదల చేశారు. బుధవారం గద్వాల జిల్లా అయిజ మండలం సింధనూరు గ్రామం వద్ద ఉన్న డిస్ట్రిబ్యూటరీ–12ఏకు చేరుకున్నాయి. ప్రస్తుతం నాలుగు అడుగుల మేర కాలువలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో అలంపూర్ నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేశారు.